కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోడీకి వైఎస్ జగన్ ఇచ్చిన అస్త్రం..!
కేసీఆర్‌ను కొంచమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే మోడీ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఊరుకుంటుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అస్త్రాన్ని ఇప్పుడు కేసీఆర్‌పై ప్రయోగించింది.
ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్ని అయినా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. గత కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ కూటమి కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం విధానాలను ఎండగడుతూనే.. తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని..కనీసం అప్పులు కూడా చేసుకోవడానికి అనుమతించడం లేదని ప్రతీ ప్రెస్ మీట్, బహిరంగ సభల్లో కేసీఆర్ చెబుతూనే ఉన్నారు. అలాంటి కేసీఆర్‌ను కొంచమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే మోడీ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఊరుకుంటుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అస్త్రాన్ని ఇప్పుడు కేసీఆర్‌పై ప్రయోగించింది.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ప్రత్యేకంగా విద్యుత్ ఒప్పందాలు ఏమీ లేవు. దీంతో రాష్ట్రానికి విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ డిస్కమ్‌లకు సరఫరా చేసింది. వాటికి సంబంధించిన బకాయిలను తెలంగాణ డిస్కమ్‌లు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. గత ఐదేళ్లుగా ఈ బకాయిలు ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. నీతి ఆయోగ్, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాల్లో కూడా బకాయిల విషయం ప్రస్తావించింది. ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఈ విషయంపై ప్రధాని మోడీకి వినతిపత్రం అందించారు.
ఇన్నాళ్లూ ఈ విషయంపై నోరు మెదపని కేంద్రం.. అకస్మాతుగా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా తెలంగాణకు బకాయి పడిన రూ. 6,756.92 కోట్లను చెల్లించాలని తెలంగాణ డిస్కమ్‌లకు కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్ బిల్లు రూ. 3,441.78 కోట్లు. దానికి లేట్ పేమెంట్ చార్జీ రూ. 3,314.14 కోట్లుగా కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా బయటి నుంచి అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రాన్ని అనుమతి కోరుతోంది. పదే పదే కోరడంతో ఆ మధ్య కేవలం రూ. 20వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి.. అది కూడా విడతల వారీగా తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాస్త కష్టపడి రూ. 10వేల కోట్లు తెచ్చి రైతు బంధు పథకానికి ఉపయోగించింది. ప్రస్తుతం డబ్బు లేకపోవడంతో దళిత బంధు పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 6వేల కోట్ల మేర బకాయిలు 30 రోజుల్లో చెల్లించాలని తెలంగాణను ఆదేశించడంపై చర్చ జరుగుతోంది.
బకాయిలు చెల్లించాలని ఆదేశించడం సరైనదే అయినా.. తెలంగాణే నిధులకు ఇబ్బందులు పడుతున్న సమయంలో అకస్మాతుగా భారీ మొత్తం చెల్లించాలని కోరడంలో రాజకీయ పరమైన నిర్ణయం ఉందని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే కేంద్రం ఇలా ఆదేశాలు జారీ చేసిందని.. అనుకోకుండా వైఎస్ జగన్ ఒక అస్త్రాన్ని మోడీకి ఇచ్చినట్లు అయ్యిందని అనుకుంటున్నారు. ఒకవైపు ఏపీకి న్యాయం చేస్తున్నామనే కలరింగ్ ఇస్తూ.. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందనే చర్చ జరుగుతోంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బకాయిల చెల్లింపుపై ప్రస్తుతానికి సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. గత ఎనిమిదేళ్ల నుంచి ఎన్నో విభజన సమస్యలు ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు చేసిన సర్థుబాటు చర్యలపై మాత్రమే కేంద్రం స్పందించడంపై ఆగ్రహంగా ఉంది.
బకాయిలు చెల్లిస్తామని 2019లోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తోంది. అంతకు ముందు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని కోరుతోంది. ఈ బకాయిలు కేవలం ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్కమ్‌ల మధ్య సమస్యే. కానీ రెండు రాష్ట్రాల సమస్య కాదని, కేంద్రం కావాలనే జోక్యం చేసుకొని ఇబ్బంది పెడుతోందని వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల మేరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశారని.. దానిపై అనసవరంగా కేంద్రం రాద్దాంతం చేస్తోందని తెలంగాణ వాదిస్తోంది. ఏదేమైనా కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికి మోడీకి ఒక అస్త్రం మాత్రం దొరికిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.