పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ.. ఓటర్ల సంఖ్య పెంపు

ఇప్పటి వరకూ ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 నుంచి 1400మంది ఓటర్ల వరకు ఉండే విధంగా అధికారులు సర్దుబాటు చేసేవారు. ఇకపై ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500ఓటర్లు ఉండేలా చూడాలని సీఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

Advertisement
Update:2023-06-04 12:09 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులను బదిలీ చేయాలంటూ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో మునుపటి కన్నా ఓటర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది.

ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలో పోలింగ్ కేంద్రాల లెక్క తీస్తే.. 2014లో 29,138 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2018లో వాటి సంఖ్య 32,574కి పెరిగింది. ఈ ఏడాది జనవరి వరకు ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాల సంఖ్య 34,891గా ఉండాలి. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యనుబట్టి పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు, ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే ఓటర్ల సంఖ్యను కూడా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 నుంచి 1400మంది ఓటర్ల వరకు ఉండే విధంగా అధికారులు సర్దుబాటు చేసేవారు. ఇకపై ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500ఓటర్లు ఉండేలా చూడాలని సీఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

హేతుబద్ధీకరణ..

ఒక్కో కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే.. ఇద్దరికి ఒక పోలింగ్ కేంద్రం, మరో ఇద్దరికి మరో పోలింగ్ కేంద్రం కేటాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరగాలని నిర్ణయించారు అధికారులు. పోలింగ్‌ కేంద్రాలను పకడ్బందీగా జియోగ్రాఫికల్‌ మ్యాపింగ్‌ చేయాలని సీఈసీ నిర్ణయించింది. తెలంగాణలో ముందుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మ్యాపింగ్‌ మొదలు పెట్టబోతున్నట్టు తెలిపారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌. ఈ ఏడాది జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా 34,891 పోలింగ్‌ కేంద్రాలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం పంపిన 63,120 బ్యాలెట్‌ యూనిట్లు, 49,310 కంట్రోల్‌ యూనిట్లు, 53,255 వీవీప్యాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News