తెలంగాణకు కేంద్ర బలగాలు.. రెండ్రోజుల్లో 20 వేల మంది రాక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి 100 కంపెనీల బలగాలు పంపించబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కేంద్ర హోంశాఖ ఈ బలగాలను తెలంగాణకు పంపిస్తోంది.
తెలంగాణ ఎన్నికలపై ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 20మంది అధికారులపై సీఈసీ బదిలీ వేటు వేసింది. వివిధ ఏజెన్సీల పనితీరు ఎప్పటికప్పుడు మదింపు చేస్తోంది. ఈ క్రమంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి భారీగా నగదు, నగలు, ఉచిత వస్తువులు తెలంగాణలో పట్టుబడ్డాయి. ఇక ఇప్పుడు కేంద్ర బలగాలు కూడా రాబోతున్నాయి. రెండ్రోజుల్లో తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తాయి.
100 కంపెనీలు, 20వేలమంది సిబ్బంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి 100 కంపెనీల బలగాలు పంపించబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కేంద్ర హోంశాఖ ఈ బలగాలను తెలంగాణకు పంపిస్తోంది. 20వేలమంది సిబ్బంది రెండ్రోజుల్లో తెలంగాణకు వస్తారు. అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్ వంటి బలగాలకు చెందిన వారు ఇందులో ఉంటారు. మొత్తం 20 వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని వీరంతా బందోబస్తు నిర్వహిస్తారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలతోపాటు.. సరిహద్దుల్లోనూ తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి వీరికి విధులు అప్పగిస్తారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ఈ బలగాలు పనిచేస్తాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎంపిక చేసిన కొన్నింటి వద్ద బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయి. పోలింగ్ ముందురోజే ఆయా కేంద్రాలను కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకుంటాయి. ఈవీఎంలు భద్రపరిచే కేంద్రాలు కూడా వీరి అధీనంలోనే ఉంటాయని తెలుస్తోంది. భద్రపరిచిన కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తీసుకెళ్లడం.. పోలింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూంలకు తరలించడం వంటి ప్రక్రియలన్నీ కేంద్ర బలగాల నియంత్రణలోనే జరుగుతాయి.