తెలంగాణలో సెల్ ఫోన్ హత్యలు

ముగ్గురు స్నేహితులు రైల్వే ట్రాక్ ఎక్కి రీల్స్ రికార్డ్ చేస్తున్నారు. సరిగ్గా రైలు వచ్చే సమయంలో పక్కకు తప్పుకోవాలనేది వారి ఆలోచన. సర్ఫ్ రాజ్ టైమ్ కి పక్కకు జరగలేకపోయాడు, ట్రైన్ ఢీకొనడంతో స్పాట్ లోనే చనిపోయాడు.

Advertisement
Update:2023-05-06 07:04 IST

ప్రతి ఏడాది చివర్లో పోలీస్ డిపార్ట్ మెంట్ నేరాల గణాంకాలు విడుదల చేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఈ లిస్ట్ ఉంటుంది. దీనిలో సెల్ ఫోన్ హత్యలు అనే కేటగిరీ కూడా యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే సెల్ ఫోన్ కారణంగా జరిగే మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో సెల్ ఫోన్ కారణంగా నలుగురు దుర్మరణంపాలయ్యారు. సిద్ధిపేట జిల్లాలో సెల్ఫీకోసం ముగ్గురు బలికాగా, హైదరాబాద్ లో ఓ యువకుడు రీల్స్ చేస్తూ రైలు ఢీకొని చనిపోయాడు. ఈ నాలుగు చావులు సెల్ ఫోన్ కారణంగానే జరిగాయి.

సెల్ఫీ సరదా వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు వదలడంతోపాటు మూడేళ్ల బాలుడి తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిల్చారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూరు వద్ద జరిగింది. హైదరాబాద్‌ కి చెందిన కైసర్, సోహెల్ అనే ఇద్దరు స్నేహితులు ఓ ఫంక్షన్లో పాల్గొనడానికి సిద్ధిపేటకు వెళ్లారు. నెంటూరు సామల చెరువు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. కైసర్ తన అన్నకొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఆ అబ్బాయికి మూడేళ్లు. పిల్లవాడిని పక్కనపెట్టి యువకులిద్దరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఇంతలో మూడేళ్ల బాబు గుంతలో జారి పడ్డాడు. అతడిని రక్షించే క్రమంలో ఇద్దరు యువకులు కూడా గుంతలో చిక్కుకుని ప్రాణాలొదిలారు.

ఇక సనత్ నగర్ రైల్వే ట్రాక్ పై ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తున్న మహ్మద్ సర్ఫ్ రాజ్ అనే యువకుడిని రైలు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సనత్ నగర్ రైల్వే లైన్ సమీపంలో రీల్స్ చేయడానికి ముగ్గురు స్నేహితులు వచ్చారు. ఏకంగా రైల్వే ట్రాక్ ఎక్కి రీల్స్ రికార్డ్ చేస్తున్నారు. సరిగ్గా రైలు వచ్చే సమయంలో పక్కకు తప్పుకోవాలనేది వారి ఆలోచన. ఇద్దరు అలాగే చేశారు. సర్ఫ్ రాజ్ టైమ్ కి పక్కకు జరగలేకపోయాడు, ట్రైన్ ఢీకొనడంతో స్పాట్ లోనే చనిపోయాడు.

గంటల వ్యవధిలో నాలుగు ప్రాణాలను తీసింది సెల్ ఫోన్. కేవలం సమాచారం చేరవేసేందుకే ఫోన్లు ఉపయోగపడినప్పుడు ఇలాంటి ప్రమాదాలు లేవు. సెల్ ఫోన్ వినోద సాధనంగా మారిన తర్వాత కుటుంబాల్లో అది పెడుతున్న చిచ్చుని ఆర్పడం ఎవరి తరం కావడంలేదు. ఇక సెల్ఫీ పిచ్చి, రీల్స్ మోజు.. యువతను బలిచేసుకుంటోంది. 

Tags:    
Advertisement

Similar News