ఈ నెల 11న ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సిబిఐ
తాము ఈ నెల 11 వ తేదీన విచారణకు వస్తామని తెలుపుతూ ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు ఈ- మెయిల్ పంపించారు. ఈ స్కాంలో విచారణ సందర్భంగా కొందరు ఆమె పేరు ప్రస్తావించినందున విషయాల పై స్పష్టత కోసం విచారించనున్నామని సిబిఐ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11 వతేదీన ఉదయం 11 గంటలకు సిబిఐ విచారించనున్నది. ఈ సందర్భంగా ఆమె స్టేట్ మెంట్ ను కూడా అధికారులు రికార్డు చేయనున్నారు. ఈ ప్రక్రియను హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే నిర్వహించేందుకు సిబిఐ అంగీకరించింది. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సిబిఐ సమాచారం ఇచ్చింది.
అంతకు ముందు 6 వ తేదీన విచారణకు సిద్ధంగా ఉండాలని ఆమెకు సిబిఐ నోటీసులు పంపింది. దీనిపై ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐ ఆర్, ఫిర్యాదు కాపీలను, ఇతర వివరాలు ఇవ్వాలని,ఈ సమాచారం తనకు పంపితే త్వరగా జావాబులిచ్చి విచారణ పూర్తి చేసుకోవడానికి వీలవుతుందని, విచారణకు తాను పూర్తి గా సహకరిస్తానని ఆమె లేఖ రాశారు. ఎఫ్ ఐఆర్ లో తన పేరు లేదని, అటువంటప్పుడు తనకు నోటీసులు ఎలా ఇస్తారని కవిత ప్రశ్నించారు. ఈ నెల 11,12,14, 15 తేదీలలో తాను ఇంటి వద్ద విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ రోజున ఆమె జగిత్యాల పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఆమె లేఖ కు సిబిఐ ఈ రోజు సాయంత్రం వరకూ ఏ సమాధానం ఇవ్వకపోవడంతో జగిత్యాల పర్యటనను రద్దు చేసుకుని తన ఇంటి వద్దనే ఉండిపోయారు. ఈ రోజు సాయంత్రం ఆమెకు ఈ- మెయిల్ పంపిస్తూ ఈ నెల 11 వ తేదీన విచారణకు వస్తామని సమాధానం నిచ్చారు. ఈ స్కాంలో విచారణ సందర్భంగా కొందరు ఆమె పేరు ప్రస్తావించినందున విషయాల పై స్పష్టత కోసం విచారించనున్నామని సిబిఐ తెలిపింది. ఈ విషయంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు సిబిఐ 11 వ తేదీన విచారించేందుకు నిర్ణయించింది. సిబిఐ నోటీసుల నేపథ్యంలో కవిత న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారని తెలిసింది. సిబిఐ ప్రశ్నలు ఎలా ఉంటాయి..ఏం జవాబులు ఇవ్వాలనే విషయాల పై తెలుసుకుంటున్నారని సమాచారం.
ఈ కేసులో ఏ స్థాయిలోనూ కవిత ప్రమేయం ఉందని నిరూపించే సమాచారం కానీ ఆధారాలు కానీ ఏమీ లేకపోయినా కవితను విచారణకు హాజరుకావాలని సిబిఐ నోటీసులు పంపడం పై టిఆర్ ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రబుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ విపక్ష నేతలను వేధిస్తోందని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రుల ఇళ్ళు ఆస్తులపై సిబిఐ దాడులు చేసి రాష్ట్రంలో భయోత్పాత వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షాపూరిత వైఖరిని ప్రశ్నిస్తున్నందునే టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తుందనే విమర్శలు వినబడుతున్నాయి.