నిన్న, కాదు ఈరోజు, కాదు రేపు..

అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించడం, తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయం అనుకుంటున్న దశలో.. ముచ్చటగా మూడుసార్లు విచారణ వాయిదా పడటం విశేషం.

Advertisement
Update:2023-04-18 16:31 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి సోమవారం ఆయనను సీబీఐ విచారణకు పిలిచింది, అయితే ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో వ్యవహారం తారుమారైంది. కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో సీబీఐ విచారణ అధికారులు కూడా అక్కడే ఉన్నారు. అందుకే విచారణను సాయంత్రానికి ఆ తర్వాత మరుసటి రోజుకి వాయిదా వేశారు. తీరా మంగళవారం ఏదో జరుగుతుందని అనుకున్నారంతా. కానీ కోర్టులో విచారణ కొనసాగుతున్న క్రమంలో మరోసారి సీబీఐ విచారణ వాయిదా వేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని సీబీఐ కార్యాలయానికి రావాలని పేర్కొంటూ నోటీసులిచ్చింది.

ముచ్చటగా మూడోసారి..

అవినాష్ రెడ్డిని ఈసారి విచారణకు పిలిపించడం, విచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయం అనుకుంటున్న దశలో.. ముచ్చటగా మూడుసార్లు విచారణ వాయిదా పడటం విశేషం. బుధవారం అయినా సీబీఐ విచారణ కొనసాగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

ముందస్తు బెయిల్ వద్దు..

మరోవైపు అవినాష్ రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉంద‌ని, ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. వివేకా హత్య కుట్ర గురించి అవినాష్ రెడ్డికి ముందే తెలుసన్నారు. గతంలో జరిగిన విచారణల్లో ఆయన సహకరించలేదని చెప్పారు. ఇటీవలే అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News