బీసీల సామాజిక న్యాయం కోసమే కులగణన : మంత్రి ఉత్తమ్
ఈనెల 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్ అన్నారు
తెలంగాణలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక, కులగణన సర్వే చేపట్టామన్నారు.‘‘స్వాతంత్ర్యం పూర్వం నుంచి భారతదేశంలో జనగణన జరుగుతోంది. అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని శాసన సభలో తీర్మానించింది. బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టాం. సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. 96.9శాతం (3.50 కోట్ల మంది) మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. 3.1శాతం (16లక్షల మంది) వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు.ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగింది. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా.. అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈనెల 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు...
తెలంగాణలోని 3,54,77,554 మంది వివరాల నమోదు.
మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు
కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం
సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం
కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం
ఎస్టీల జనాభా 10.45 శాతం
రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతం
ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08
ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం