పాతబస్తీలో మాధవీలతపై కేసు.. చుట్టుముట్టిన MIM
పాతబస్తీలో పోలింగ్ పరిశీలనకు వెళ్లిన మాధవీలతకు MIM నుంచి నిరసన వ్యక్తమైంది. MIM నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా మాధవీలతను చుట్టుముట్టారు.
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలింగ్ పరిశీలనలో భాగంగా మాధవీలత వ్యవహరించిన తీరు వివాదానికి కారణమైంది. సైదాబాద్ డివిజన్ హమాలీ బస్తీలోని 64వ పోలింగ్ సెంటర్‌కు మాధవీలత వెళ్లారు.
MIM పోలింగ్ ఏజెంట్ రఫత్ ఉన్నీసా ఐడీకార్డు తీసుకొని ముఖాన్ని చూపించాలని కోరారు. దీంతో ఆమె బుర్ఖాతీసి ముఖాన్ని చూపించింది. ఆధార్ కార్డులో ఉన్న ఫొటోతో ముఖం మ్యాచ్ అవటంలేదని ఆ మహిళను పోలింగ్ బూత్ నుంచి పంపించాలని మాధవీలత బూత్ పోలింగ్ అధికారితో చెప్పారు.
దీంతో రఫత్ ఉన్నీసా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ వారి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదంపై బూత్ పోలింగ్ అధికారి అరుణ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు.
మాధవీలతను చుట్టుముట్టిన MIM..
అనంతరం పాతబస్తీలో పోలింగ్ పరిశీలనకు వెళ్లిన మాధవీలతకు MIM నుంచి నిరసన వ్యక్తమైంది. MIM నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా మాధవీలతను చుట్టుముట్టారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన మాధవీలత భద్రతా సిబ్బంది, పోలీసులు వాళ్లను చెదరగొట్టారు.
ఎన్నికల అధికారులు, MIMతో కుమ్మక్కై రిగ్గింగ్‌కు సహకరించారని మాధవీలత ఆరోపించారు. చాంద్రాయణగుట్ట, రియాసత్‌నగర్ డివిజన్‌లోని 40వ నంబర్ పోలింగ్ బూత్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా ఇంటిగేట్లు మూసేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మాధవీలత ఆరోపించారు.