కరీంనగర్ లో క్యాంపు రాజకీయం.. హోటల్ లో కార్పొరేటర్లు

మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందని, బీఆర్ఎస్ తో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు గంగుల. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మిగిలిపోతారని కార్పొరేటర్లకు హితబోధ చేశారు.

Advertisement
Update:2024-01-20 11:15 IST

తెలంగాణ ఎన్నికల ముందు నాయకులు ఎడాపెడా కండువాలు మార్చేశారు. ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాస్త ఆ వేగం తగ్గింది. అయితే అధికార కాంగ్రెస్ లోకి చేరికలు భారీగా ఉంటాయనే అంచనాలు మాత్రం ఉన్నాయి. పై స్థాయి నేతలు లోక్ సభ ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉండగా.. కింది స్థాయి నేతలు మాత్రం కాంగ్రెస్ కండువాలు కప్పుకోడానికి రెడీ అయిపోయారు. ఈ క్రమంలో పలు స్థానిక సంస్థల పాలక వర్గాల్లో బీఆర్ఎస్ బలం తగ్గిపోతోంది. తాజాగా కరీంనగర్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓ హోటల్ కి తరలించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

బీఆర్ఎస్ చేతిలో ఉన్న కరీంనగర్ మున్సిపాల్టీలో కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే అనుమానాలున్నాయి. దీంతో మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ కు తమ కార్యకర్తల్ని తరలించారు. బీఆర్ఎస్ లోనే కొనసాగాలని వారికి హితబోధ చేస్తున్నారు ఎమ్మెల్యే గంగుల. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందని, బీఆర్ఎస్ తో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మిగిలిపోతారని వారికి తేల్చి చెప్పారు గంగుల.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి వచ్చిన మెజార్టీ స్వల్పం. 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 60 కాగా.. కాంగ్రెస్ కి 64 సీట్లు వచ్చాయి. ఈ మెజార్టీతో కాంగ్రెస్ ఐదేళ్ల పాలన సజావుగా సాగదని కొందరు అంచనా వేస్తున్నారు. తాజాగా గంగుల కమలాకర్ కూడా కార్పొరేటర్ల వద్ద ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని.. బీఆర్ఎస్ తో మిగతా పార్టీలు కలిస్తే.. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకుంటాయని గంగుల చెప్పినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ అధికారాన్ని ఐదేళ్లు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News