కొత్త రేషన్ కార్డుకు అర్హతలు ఇవే.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉండాలని, ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేసింది.
రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎట్టకేలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హతలు ప్రకటించింది.
కొత్త రేషన్ కార్డు పొందాలంటే అర్హతలు ఇవే..
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి వార్షిక ఆదాయం రూ.లక్షన్నర, మాగాణి అయితే మూడన్నర ఎకరాలు, చెలక అయితే ఏడున్నర ఎకరాల లోపు ఉండాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి అర్హతలు వార్షిక ఆదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలని నిర్ణయించారు. ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తకార్డులు ఇవ్వాలని, అవి కూడా స్వైపింగ్ మోడ్‌లో ఉండేలా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉండాలని, ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. గడిచిన పదేళ్లలో రేషన్ కార్డుల జారీ ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో ఇటీవల రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.