ప్రైవేటు బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

నార్సింగి అలేఖ్య రైజ్‌ టవర్స్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Update:2024-06-24 07:50 IST

ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతిచెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ అతిగా మద్యం సేవించి ఉన్నాడని, మద్యం మత్తులో మితిమీరిన వేగంతో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని నార్సింగి పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరి వెళ్లాల్సిన మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు గచ్చిబౌలి నుంచి బయలుదేరిన 15 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. అప్పటికి బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. నార్సింగి అలేఖ్య రైజ్‌ టవర్స్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అప్ప‌టికే కురిసిన వర్షం వల్ల రోడ్డంతా తడిగా ఉంది. దీంతో మలుపు తీసుకునే క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడరును ఢీకొట్టి బోల్తా పడింది.

దీంతో బస్సు కిటికీ పగిలి బస్సులో ఉన్న ఒంగోలుకు చెందిన మమత (33) అనే మహిళ కిందపడ్డారు. ఆమెపై బస్సు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ప్రయాణికులకు తలకు, చేతులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం నానక్‌ రాంగూడలోని కాంటినెంటల్ ఆస్ప‌త్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. రహదారిపై అడ్డంగా బస్సు బోల్తా పడటంతో అప్పా కూడలి నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనాలను కొన్ని గంటలసేపు దారి మళ్లించారు. పోలీసులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని మ‌ద్యం సేవించాడా, లేదా అని టెస్టు చేయ‌గా 197 పాయింట్లు వచ్చినట్టు తెలిపారు. డ్రైవర్‌ అతిగా మద్యం తాగినట్టు దీనినిబట్టి అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News