ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్, రైల్వే స్టేషన్లు
శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో సొంతూళ్లకు వెళ్తున్నజనాలు
హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఇప్పటికే టీజీఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నది. పుట్టిన ఊరిలో కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడంతో పాటు చిన్ననాటి స్నేహితులను సంక్రాంతికి అంతా కలుస్తుంటామని వారు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబసభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నది. ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.