కారు వెళ్లింది సర్వీసింగ్‌కే.. షెడ్డుకు కాదు - కేటీఆర్
బీఆర్ఎస్‌ను గెలిపించుకోక ప్రజలు తప్పు చేశారని అనడం సరికాదన్నారు కేటీఆర్. ప్రజలపై కామెంట్స్ చేయొద్దని పార్టీ నేతలకు సూచించారు.
పదేళ్ల పాటు విరామం లేకుండా పనిచేసిన కారు.. మరింత స్పీడుగా వెళ్లేందుకు సర్వీసింగ్‌కు వెళ్లిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్‌కు ఓటమి కొత్త కాదని.. ఇది స్పీడ్ బ్రేకర్ లాంటిదేనన్నారు. రాబోయే పార్లమెంట్, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్‌ను గెలిపించుకోక ప్రజలు తప్పు చేశారని అనడం సరికాదన్నారు కేటీఆర్. ప్రజలపై కామెంట్స్ చేయొద్దని పార్టీ నేతలకు సూచించారు. రెండు సార్లు బీఆర్ఎస్‌ను గెలిపించింది అదే ప్రజలని స్పష్టం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించలేదని.. చాలా చోట్ల వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు. ఇలాంటివి 14 స్థానాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ ఇచ్చింది కేవలం ఆరు గ్యారంటీలు మాత్రమే కాదన్న కేటీఆర్.. మొత్తం 420 హామీలన్నారు. నిరుద్యోగ భృతి, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాలపై ప్రభుత్వం మాట తప్పిందన్నారు కేటీఆర్. యాసంగి వరి నాట్ల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు డిసెంబర్ 9 నాటికే పంపిణీ చేస్తామన్న హామీ ఏమైందన్నారు.