తెలంగాణ ప్రగతిపై బీఆర్ఎస్ "స్వేదపత్రం"
తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ రూపంలో చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది బీఆర్ఎస్ పార్టీ. సభలో కాంగ్రెస్ ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టినప్పటికీ.. తెలంగాణలో గత తొమ్మిదన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సృష్టించిన సంపదపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్వీట్ చేశారు. తొమ్మిదన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటొడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమమన్నారు కేటీఆర్. అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమంటూ హెచ్చరించారు.
గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా "స్వేదపత్రం" పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో స్పష్టంచేశారు.