4 గేట్లు తెరుస్తాం.. 26 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు
నాలుగు గేట్లు ఎత్తేస్తే వారంతా కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు బీర్ల ఐలయ్య. 26మంది రెడీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. వారి పేర్లు మాత్రం చెప్పలేదు.
కాంగ్రెస్ గేట్లు తెరిస్తే విధ్వంసమేనంటూ ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. 100 రోజులు కేవలం పాలనపైనే దృష్టిపెట్టానని, ఇకపై పీసీసీ అధ్యక్షుడిగా పార్టీపై ఫోకస్ పెడతానన్నారాయన. తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని, అలాంటప్పుడు తామెలా ఊరుకుంటామని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ బాట పట్టారు. ఒకరిద్దరు కాదు, మొత్తం 26మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని ఇప్పుడు బాంబు పేల్చారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నలుగురైదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు రేవంత్ ని కలిశారు. ఓ దశలో వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే పుకార్లు వినిపించినా ఎవరూ ధైర్యం చేయలేదు. ఈలోగా దానం నాగేందర్ చడీ చప్పుడు లేకుండా నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విశేషం. అయితే నాగేందర్ లాంటి వాళ్లు ఇంకా 26మంది బీఆర్ఎస్ లో ఉన్నారని అంటున్నారు బీర్ల ఐలయ్య. ప్రజాపాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతామంటున్నారని ఆయన వివరించారు.
నాలుగు గేట్లు ఎత్తేస్తే వారంతా కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు బీర్ల ఐలయ్య. 26మంది రెడీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. వారి పేర్లు మాత్రం చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ ఈ చేరికలపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గతంలో కాంగ్రెస్ నేతలు పార్టీ మారినప్పుడు రాళ్లతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని ఎలా వారివైపు తిప్పుకుంటున్నారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. లోక్ సభ ఎన్నికల నాటికి తెలంగాణలో ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి.