తెలంగాణలో LRS రగడ.. BRS ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇచ్చారు.

Advertisement
Update:2024-03-06 12:45 IST

లే అవుట్‌ లేని ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(LRS)ని అమలు చేసే క్రమంలో ఫీజు వసూలు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉచితంగా LRS అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ఉచితంగా LRSను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌, ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దారుణం అని అంటున్నారు. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి , సీతక్క మాట్లాడిన మాటలను వారు గుర్తు చేశారు. LRS పేరుతో ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా LRS చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకూ ఆరు గ్యారెంటీల అమలుకోసం బీఆర్ఎస్ పట్టుబడుతూ వచ్చింది. మేడిగడ్డ వ్యవహారంపై బస్సు యాత్ర ద్వారా ఆందోళన చేపట్టింది. ఇప్పుడు LRSపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు నేతలు. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొస్తుందా..? LRS ఫీజు వసూలుపై ప్రకటన చేస్తుందా..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News