భూ భారతి యాడ్స్‌పై బీఆర్‌ఎస్ ప్రివిలేజ్ మోషన్
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం ప్రకటన
అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని.. ఇది సభ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో ప్రభుత్వం భూభారతిపై ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సభ హక్కుల ఉల్లంఘన కింద ప్రభుత్వంపై స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది. సభ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీలో చర్చ జరిగే దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొంటూ ఎలా ప్రకటనలు ఇస్తారని ప్రశ్నించిన బీఆర్‌ఎస్ సభ్యులు. ప్రభుత్వం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు మోసం చేస్తోందని.. అసెంబ్లీ, కౌన్సిల్ గౌరవాన్ని దెబ్బతీసిందని.. స్పీకర్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని కలిగించారని వివరించారు.