అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం.. ఆగస్టులో అభ్యర్థుల ప్రకటన?

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అసమ్మతి, ఇబ్బందులు లేని నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది.

Advertisement
Update:2023-07-25 07:22 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలు సమాయత్తం చేసింది. ప్రభుత్వ పరంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం లభించింది. త్వరలోనే పార్టీ పరంగా కూడా గడపగడపకూ బీఆర్ఎస్ చేసిన పనులను తీసుకెళ్లే ఆలోచనలతో ఉన్నది. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే అంచనాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) టికెట్‌పై గెలిచిన వారితో పాటు ఇతర పార్టీల తరపున గెలిచి అధికార పార్టీలో చేరి వారు ఇందులో ఉన్నారు. అయితే ఈ సారి బీఆర్ఎస్ నేరుగా 100కు పైగా సీట్లలో గెలవాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని అభివృద్ధి, అమలులో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో చేశామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాల్సి ఉందని.. దీన్ని కొనసాగించాలంటే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో ముందుగానే టికెట్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అసమ్మతి, ఇబ్బందులు లేని నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. దాదాపు 70 నుంచి 80 సీట్లను అగస్టులో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్, టీడీపీతో పాటు ఒకరు ఫార్వర్డ్ బ్లాక్, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచిన వారు బీఆర్ఎస్‌లో చేరారు. వీరందరికీ బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, గత ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సంప్రదించిన తర్వాతే వీళ్లకు టికెట్లు ఇస్తారనే చర్చ జరుగుతున్నది.

ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పలు మార్లు సర్వేలు చేయించారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు తేలింది. అలాంటి చోట్ల ముందుగా అభ్యర్థులను ప్రకటించకపోవచ్చు. అక్కడ ప్రత్యామ్నాయంగా మరొకరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గాను.. ఇప్పటికే పలు మార్గాల ద్వారా సీఎం కేసీఆర్ సర్వే చేయించినట్లు సమాచారం. గతంలో సిట్టింగులు అందరికీ టికెట్లు ఇచ్చారు. ఈ సారి కొందరిని మార్చే అవకాశం ఉన్నది. అయితే, ఇలా మార్చడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా.. ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా వెల్లడిస్తారని తెలుస్తున్నది.

అభ్యర్థుల ప్రకటన విషయంలో జాప్యం చేయకుండా.. రెండు విడతల్లోనే జాబితాను విడుదల చేయనున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. రెబెల్ అభ్యర్థులు లేకుండా.. అసంతృప్తులు పెరుగకుండా చూడటానికి కూడా పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై కూడా సీఎం కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి కొత్తగా ఇప్పుడు ఎవరైనా వచ్చినా.. వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టికెట్లు కోసం భారీగా పోటీ నెలకొన్నది. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఆశావహులు ఉన్నారు. ఇలాంటి సమయంలో ముందస్తుగా టికెట్లు ప్రకటించడం ద్వారా.. ఎక్కడైనా అసంతృప్తులు ఉన్నా.. అక్కడ సమస్యను పరిష్కరించేందుకు సమయం ఉంటుందని పార్టీ భావిస్తోంది.

అగస్టు 3వ వారంలోగా అన్ని నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరికీ దాదాపుగా టికెట్లు వస్తాయని అంచానా వేస్తున్నారు. చాలా తక్కువ చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News