బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవాలు ఏడాది పాటు నిర్వహిస్తాం : కేటీఆర్
తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమని కేటీఆర్ తెలిపారు
తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తెలంగాణ భవన్‌లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశం వివరాలు వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం.. ప్రజా ఉత్సవంగా జరపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ. తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగాల గురించి సమావేశంలో గుర్తు చేసుకున్నాం. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ చెప్పేది ముఖ్యంగా ఒకటే.. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి.. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి.. ఇదే బీఆర్‌ఎస్ పార్టీ విధానమని ఆయన తెలిపారు.అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన లేదు.
తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. బీఆర్‌ఎస్ రజతోత్సవాలు ఏడాది పాటు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించాం. ఉత్సవాల నిర్వహణకు సీనియర్ నేతల ఆధ్వర్యంలో త్వరలో కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని కేటీఆర్ తెలిపారు. అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన మాకు లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యం టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక సంవత్సరం మొత్తం రజతోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ రజతోత్సవాలను వినూత్నంగా నిర్వహించి ఉద్యమకారులను తిరిగి ఒకటి చేస్తూ ముందు పోవాలనే ఆలోచన చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ రెండో వారంలో పార్టీ ప్రతినిధుల సమావేశం హైదరాబాదులో ఉంటుంది. త్వరలోనే తేదీ వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభ నిర్వహిస్తాం. ఎక్కడ అనేది నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు.