ఫోన్ చేస్తే రమ్మంటున్నారు... గేటు వద్దే నిలువరిస్తున్నారు
ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్యను దారుణంగా అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం
ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఆయనే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ప్రజా సమస్యలు విన్నవించడానికి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి నాలుగు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆయన వాపోయారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సీఎంను కలవడానికి ఇప్పటివరకు నాలుగుసార్లు యత్నించాను. తెలిసిన నేతలు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారు. సీఎంను కలిసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యల ముఖ్యమంత్రికి విన్నవించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంటి గేటు వద్దనే నిలువరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
తమది ప్రజాపాలన, ప్రజలు ఎప్పుడైనా తనను కలువొచ్చని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదకగా గప్పాలు కొట్టారు. కానీ ఆచరణలో మాత్రం ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ప్రజాసమస్యల గురించి గొంతెత్తే వాళ్లను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్యను కలవడానికి సమయం లేదు కానీ జైలు తనకు సహాయ సహకారాలు చేశాడని హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించిన తరి నాగయ్యకు సన్మానం చేయడంపై నెటీజన్లు, తెలంగాణవాదులు ఫైర్ అవుతున్నారు.