రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, రేవంతే
దీనిపై మంత్రి ఉత్తమ్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల విషయంలో హరీశ్ రావు, బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వానికి సూచనలు చేస్తే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా ఉత్తరకుమారుడి తరహాలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డేనని ధ్వజమెత్తారు.9 ఏండ్లు మేము చంద్రబాబును అడుగు కూడా పెట్టనివ్వలేదు.. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసామన్నారు. కానీ మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీకి, చంద్రబాబుకు తల వంచి.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రంపై మాట్లాడకుండా కేసీఆర్‌ను తిడుతున్నారంటూ జగదీశ్ మండిపడ్డారు. కృష్ణా జలాలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పందించకపోతే చరిత్ర హీనులు అవుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం కేంద్రానికి విజ్ఞప్తి చేశామంటే సరిపోతుందా? బండి సంజయ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనుకుంటే ఏపీకి నీరు ఎలా పోతుంది అంటూ ప్రశ్నించారు. నీటి విషయంలో మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మన హక్కుగా ఉన్న 123 టీఎంసీల గురించి మాట్లాడాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై మాట్లాడటం మానేసి కేంద్రాన్ని, చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. బీజేపీ, చంద్రబాబును విమర్శించడానికి భయపడుతున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అధికారులతో మాట్లాడి ఏపీ నీరు తీసుకోకుండా ఎందుకు ఆపడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ అవినీతి గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.