కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం సోమవారానికి వాయిదా
ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి మేరకు నిర్ణయం
కృష్ణా నది బోర్డు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం సోమవారానికి వాయిదా పడింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు, ఇతర అంశాలపై చర్చించడానికి ఇవాళ కేఆర్‌ఎంబీ మొదట సమావేవాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ మధ్యాహ్నం సమావేవం కావాల్సి ఉంది. అయితే తనకు ముందుగానే నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందువల్ల ఇవాల్టి సమావేశానికి హజరుకాలేకపోతున్నానని. సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సమావేశాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ జల సౌధలో సమావేశం జరగనున్నది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ సమాచారం పంపింది. ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల్లో తెలంగాణ కు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 వరకు నాగార్జునాసాగర్‌లో 510 అడుగుల పైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగుల పైన 30 టీఎంసీల నీరు మిగిలి ఉన్నది. రెండు జలాశయాల్లో నీటి నిల్వలు జూన్, జులై వరకు తాగు నీటి అవసరాలకు, వివిధ ఔట్ లెట్ల నుంచి నీటిని తీసుకునే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది.అటు ఏపీ ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్నదని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని నిన్న హరీశ్‌రావు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేఆర్‌ఎంబీతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. గురువారం కృష్ణా బోర్డు ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజా పరిణామల నేపథ్యంలో సోమవారం జరగనున్న బోర్డు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది.