ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన

నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో నిర్మాణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2025-02-21 11:21 IST

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్‌ సర్కార్‌ నేడు శ్రీకారం చుట్టనున్నది. మొదటిదశ కింద చేపట్టే పనులను సీఎం రేవంత్‌ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. జనవరి 26న మొదటి విడతలో హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం విదితమే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మధ్యాహ్నాం హెలికాప్టర్‌ లో వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లికి వెళ్లనున్న రేవంత్‌ రెడ్డి ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు. ఆలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా నారాయణపేట జిల్లా అప్పకపల్లికి వెళ్లి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ ను ప్రారంభిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట వైద్య కాలేజీకి చేరుకోనున్న సీఎం మాతా శిశు కేంద్రం, నర్సింగ్‌ కళాశాల సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు.

Tags:    
Advertisement

Similar News