ఢిల్లీలో బీఆర్ఎస్ సందడి.. నేడే ఆఫీస్ ప్రారంభోత్సవం
ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు కేసీఆర్. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటారు. విపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశమవుతారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1.05గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో ఈ ఆఫీస్ ఏర్పాటు చేశారు. 1100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+3 విధానంలో దీన్ని నిర్మించారు. 2021 సెప్టెంబర్ 2న భూమిపూజ జరగగా.. ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు సుదర్శన హోమం, వాస్తుపూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం 1.05 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించి, మొదటి అంతస్తులోని తన చాంబర్ కు చేరుకుంటారు కేసీఆర్. మీటింగ్ హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహిస్తారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ రెండు రోజులుగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ బుధవారమే ఢిల్లీకి రావల్సి ఉన్నా భారీ వర్షం నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదాపడింది. హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు కేసీఆర్. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటారు. విపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశమవుతారు.
జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ అడుగు పెడుతున్న వేళ, ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పెద్ద పండగలా నిర్వహిస్తున్నారు. కార్యాలయం పరిసరాలను గులాబీ జెండాలు, కేసీఆర్ స్వాగత బ్యానర్లతో నింపేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు.. పెద్ద ఎత్తున నేతలు ఢిల్లీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.