మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే..?

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందేలా చూడాలంటూ ఇటీవల కాంగ్రెస్‌, బీజేపీతో పాటు పార్లమెంట్‌లో 47 పార్టీలకు లేఖలు రాశారు.

Advertisement
Update:2023-09-19 08:01 IST

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్ఎస్ కృషి ఉందన్నారు. బలమైన పార్టీల డిమాండ్‌వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్‌, ఓబీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని కవిత గుర్తుచేశారు. 2014, 19 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ.. మోడీ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లును 9 ఏళ్లుగా దాటవేస్తూ వచ్చిందన్నారు. ఇక చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర మహిళలు సంబరాలు చేసుకున్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందేలా చూడాలంటూ ఇటీవల కాంగ్రెస్‌, బీజేపీతో పాటు పార్లమెంట్‌లో 47 పార్టీలకు లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మార్చిలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వ‌ద్ద ధర్నా చేప‌ట్టారు. ఈ ధర్నాకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సైతం మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఇటీవల హైదరాబాద్‌ వేదికగా జరిగిన CWC సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బిల్లుకు మద్దతు ఇస్తూ తీర్మానం కూడా చేసింది. కాంగ్రెస్‌ తీర్మానాన్ని సైతం కవిత స్వాగతించారు. సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News