కవిత అరెస్టు.. చంద్రబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్
మరోవైపు కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు కేటీఆర్. కవిత అరెస్టు విషయమై సీనియర్ న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార దుర్వినియోగం, కక్ష సాధింపు చర్యలు గత పదేళ్ల బీజేపీ పాలనలో సర్వసాధారణంగా మారాయన్నారు. మార్చి 19న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. హడావుడిగా అరెస్టు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు కేటీఆర్. సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను సైతం ఈడీ తప్పిందన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కవిత అరెస్టు విషయంలో న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఇక 2019 ఫిబ్రవరి 6న చంద్రబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కేటీఆర్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులను వారి కుటుంబ సభ్యులను బలిపశువులను చేయడానికి బీజేపీ.. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను వినియోగించడం ఆందోళన కలిగిస్తోందని ఆ ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ కక్ష విషయంలో బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోందంటూ ఫైర్ అయ్యారు ఆ ట్వీట్‌లో చంద్రబాబు. ప్రతిపక్షాలపై ఇప్పుడే దాడులు ఎందుకంటూ ఆయన ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. అయితే చంద్రబాబు గత ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు కేటీఆర్. కవిత అరెస్టు విషయమై సీనియర్ న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు. ఈ అంశంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఆయన సమాలోచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.