ఆటోలో అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు.. హైటెన్షన్‌

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలోనే అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయనను అసెంబ్లీ గేటు దగ్గరే ఆపేశారు.

Advertisement
Update:2024-02-09 12:30 IST

BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో వచ్చారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంచుకున్నారు. అయితే అసెంబ్లీ గేటు దగ్గర BRS ఎమ్మెల్యేలను సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆటో డ్రైవర్లను నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫ్రీ బస్‌ స్కీం అమల్లోకి తీసుకురావడం మంచిదేనని..ఆ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 లక్షల 50 వేల మంది ఆటో డ్రైవర్లను ఆదుకునేవిధంగా బడ్జెట్‌లో పొందుపరచాలన్నారు.

గురువారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలోనే అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయనను అసెంబ్లీ గేటు దగ్గరే ఆపేశారు. దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు పాడి కౌశిక్ రెడ్డి. ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నమని చెప్పారు కౌశిక్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్ స్కీం తీసుకువచ్చింది. దీంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిపోయింది. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News