సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై సభలో స్పందించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారిని అక్కడినుంచి మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. అయితే బయట కూడా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలించారు.
అన్యాయాన్ని ఎదిరిస్తే తమను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. చేసిన తప్పుకి రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారాయన. వ్యాన్ లో నుంచి ఆయన నినాదాలు చేశారు.
రేవంత్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని అన్నారు హరీష్ రావు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై సభలో స్పందించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.