బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
కార్యకర్తలందరినీ పిలిచి ఎలా పని చేయాలి? ఓట్లు ఎలా రాబట్టాలంటూ ఎప్పటి లాగే సమావేశం పెట్టి మాట్లాడితే వారికి అర్థం అవుతుందో లేదో అని అనుమానించారు.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు మార్గాలను అన్వేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఊర్లు తిరిగినా.. క్షేత్ర స్థాయిలో ఓట్లు వేయించాలంటే కార్యకర్తలు, నాయకులే కీలకంగా మారనున్నారు. ప్రచారం సమయంలో కానీ, పోలింగ్ రోజు కానీ బూత్ స్థాయి కార్యకర్తలే ఏ అభ్యర్థికి అయినా బలం. అందుకే రాజకీయ పార్టీలు కూడా బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కూడా బూత్ స్థాయి కార్యకర్తలపై దృష్టి పెట్టారు.
కార్యకర్తలందరినీ పిలిచి ఎలా పని చేయాలి? ఓట్లు ఎలా రాబట్టాలంటూ ఎప్పటి లాగే సమావేశం పెట్టి మాట్లాడితే వారికి అర్థం అవుతుందో లేదో అని అనుమానించారు. అందుకే బూత్ కమిటీ కార్యకర్తలు, నాయకుల కోసం ఒక మోటివేషనల్ సెషన్ అరేంజ్ చేశారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావును పిలిచి బూత్ స్థాయి నాయకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి, ప్రజలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎలా వివరించాలి అనే విషయాలను ఆ శిక్షణ కార్యక్రమంలో తెలియజేశారు. గంపా నాగేశ్వరరావు తనదైన శైలిలో కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతూ, వారిని మాట్లాడిస్తూ, సరదాగా స్టోరీస్ చెబుతూ ఆకట్టుకున్నారు. ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలో కూడా కార్యకర్తలకు చెప్పారు.
ముఖ్యంగా మహిళా ఓటర్ల దగ్గరకు వెళ్తే వాళ్లు చాలా ప్రశ్నలు అడుగుతారని.. వారికి తీరిగ్గా ఎలా సమాధానం ఇవ్వాలో కూడా కార్యకర్తలకు వివరించారు. కాలేరు వెంకటేశ్ ఇలా వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం కార్యకర్తలను అమితంగా ఆకట్టుకున్నది. నూతనోత్సాహంతో వాళ్లు క్షేత్ర స్థాయిలో తిరగడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అంటున్నారు. మొత్తానికి కాలేరు వెంకటేశ్ విభిన్నంగా ఆలోచించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంతో అంబర్‌పేట నియోజకవర్గంలోని కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా మరింత ఉత్సాహంతో పని చేస్తామని చెబుతున్నారు.