యూట్యూబ్ ఛానెల్స్‌కు హరీష్ రావు స్వీట్ వార్నింగ్
ఈ అంశంపై తాజాగా స్పందించారు హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
BRS పార్టీకి అవసరమొచ్చిన ప్రతిసారీ తన విధేయతను నిరూపించుకుంటూనే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ విషయంలో ఆయనను శంకించాల్సిన అవసరం లేదు. గతంలో ఆయనను ఏదో విధంగా BRS పార్టీకి దూరం చేయాలన్న ప్రయత్నాలు చాలానే జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ ఆ విషయంలో ఎవరూ సక్సెస్ కాలేదు. తాజాగా కూడా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కాదు కేటీఆర్‌ను తప్పించి హరీష్ రావును BRS వర్కింగ్ ప్రెసిడెంట్ చోయబోతున్నారంటూ మరికొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ఈ అంశంపై తాజాగా స్పందించారు హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
హరీష్ రావు ఏమన్నారంటే?
కొంతమంది వ్యూస్ కోసం, సెన్సెషన్ కోసం తప్పుడు హెడింగ్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కేవలం బ్రేకింగ్స్ కోసం, వ్యూస్ కోసం ఒక నాయకుడి నిబద్ధత మీద అసత్యాలు ప్రచారం చేయడం, క్రెడిబిలిటీని వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇలాంటివి మానుకోవాలని సోషల్‌మీడియాకు, మీడియా ఛానెల్స్‌కు సూచించారు. ఏదైనా అనుమానముంటే ముందుగా తన దగ్గర క్లారిటీ తీసుకోవాలన్నారు. ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల లీడర్, పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతింటుందన్నారు.
ఇక భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అయితే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనంటూ వార్నింగ్ ఇచ్చారు. థంబ్ నెయిల్స్ వాస్తవాలకు దగ్గర ఉండేలా చూడాలన్నారు. గతంలో ఇదే విషయాన్ని తాను చాలా సార్లు చెప్పానన్నారు హరీష్ రావు. పార్టీ చీఫ్ కేసీఆర్ ఏది చెప్పినా కార్యకర్తగా అనుసరించే వ్యక్తినన్నారు హరీష్ రావు. బీజేపీలోకి, కాంగ్రెస్‌లోకి వెళ్లే అవసరం తనకు లేదన్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం మానుకోవాలన్నారు.