రేవంత్ గాలి మాటలొద్దు.. హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి మెజార్టీ వచ్చిందన్నారు హరీష్ రావు. అక్కడ రేవంత్ రెడ్డే బీజేపీకి ఓట్లు మళ్లించారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలన్నారు హరీష్ రావు
బీఆర్ఎస్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసిన ఆరోపణలపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. మెదక్‌లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడడం సరికాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెదక్‌లో పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలుంటే మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చిందన్నారు. రఘునందన్ సొంత నియోజకవర్గం దుబ్బాకలోనూ బీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చిందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి మెజార్టీ వచ్చిందన్నారు హరీష్ రావు. అక్కడ రేవంత్ రెడ్డే బీజేపీకి ఓట్లు మళ్లించారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలన్నారు హరీష్ రావు. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారన్న హరీష్.. వారంతా బీజేపీని గెలిపించారా చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని ఎదురు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌కు 32 వేల మెజార్టీ వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజార్టీ మాత్రమే వచ్చిందన్నారు. మిగతా ఓట్లు రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారా..? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరిలోనూ బీజేపీ భారీ మెజార్టీతో ఎలా గెలిచిందో చెప్పాలన్నారు హరీష్.
బీజేపీ పంచన చేరి, మోడీ శరణు చొచ్చింది రేవంత్ రెడ్డేనని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్‌లో ఉండి రేవంత్ బీజేపీ ఎజెండాను అమలుచేస్తున్నారని ఆరోపించారు. నిండు సభలో మోడీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్.. మోడీతో కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదని రేవంత్‌ను ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయన్న హరీష్ రావు.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రేవంత్ చెప్పడం సిగ్గుచేటన్నారు.