కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు ఎమ్మెల్యే చెన్నమనేని. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు.
బీఆర్ఎస్ లో సిట్టింగ్ లకు టికెట్లు దక్కని చోట.. వారిని కూల్ చేసేందుకు అధిష్టానం ఆల్రడీ పదవులిచ్చింది. కానీ ఆయా పదవులతో వారు సంతోషంగా ఉన్నారా లేక లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారా అనేది తేలాల్సి ఉంది. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి టికెట్ ఇవ్వలేదు సీఎం కేసీఆర్. ఆ స్థానాన్ని చెల్మెడ లక్ష్మీనరసింహారావుకి కేటాయించారు. రమేష్ బాబుకి ఇటీవల రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. కేబినెట్ ర్యాంక్ కేటాయించారు. అయినా కూడా రమేష్ బాబు సంతృప్తి చెందినట్టు కనిపించడంలేదు. వేములవాడ అభ్యర్థి చెల్మెడతో కలసి సభలు, సమావేశాలకు హాజరవుతున్నా.. అక్కడక్కడ తన అసంతృప్తిని బయటపెడుతున్నారు.
తాజాగా వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో జరిగిన సభలో ఎమ్మెల్యే రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకపోతే తానే తిరగబడి పోరాటం చేస్తానన్నారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా.. ప్రతిపక్ష నేతలా పోరాటం చేశానని చెప్పారు. తాను మంత్రినైనా బాగుండేదేమో, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారమయ్యేవేమో అంటూ ముక్తాయించారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై తాను ప్రశ్నించాననే విషయం ప్రజలకు తెలియాలని అందుకే, ఇప్పుడు ఆ విషయం చెబుతున్నానన్నారు.
కాళ్లు పట్టుకోలేదు కానీ..?
ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు ఎమ్మెల్యే చెన్నమనేని. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ పోరాటం చేస్తానన్నారు. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల విషాదగాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడకు సూచించారు చెన్నమనేని. తాజా వ్యాఖ్యలతో ఎమ్మెల్యే చెన్నమనేనికి టికెట్ రాలేదనే అసంతృప్తి మరోసారి బయటపడింది. కేబినెట్ ర్యాంక్ ఇచ్చినా కూడా ఆయన ఖుషీ కాలేదని స్పష్టమవుతోంది. అయితే పార్టీ గురించి కానీ, అధినాయకత్వం గురించి కానీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.