ఇదెక్కడి ఘోరం..? ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై బీఆర్ఎస్ ధ్వజం
వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడిన ఘటన కలకలం రేపింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. కరెంటు కోతలు లేవని ఓవైపు ప్రజా ప్రతినిధులు చెబుతున్నా.. మరోవైపు కళ్లముందు కనపడుతున్న సాక్ష్యాలను వారు కాదనలేకపోతున్నారు. ఇటు ప్రతిపక్షం ఈ ఉదాహరణలన్నిటితో కాంగ్రెస్ ని కార్నర్ చేసింది. సమాధానం చెప్పుకోలేక, కోతలు లేవని పదే పదే అదే ధీమాతో చెప్పలేక కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఎంజీఎంలో ఘోరం..
వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడిన ఘటన కలకలం రేపింది. ఆస్పత్రిలో ఉన్న పురిటి పిల్లల నుంచి వృద్ధుల వరకు కరెంటు లేక సతమతమయ్యారు. వరంగల్ ఆస్పత్రికి కరెంటు సరఫరా చేసే విద్యుత్ తీగలపై పతంగి పడటంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్లు కూడా పనిచేయలేదు. నాలుగు జనరేటర్లున్నా ఒక్కటి మాత్రమే పనిచేయడంతో ఐసీయూలో ఉన్న రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. వార్డుల్లో ఫ్యాన్లు తిరగక కొంతమంది బయటకు వచ్చి వరండాలో కూర్చున్నారు. దాదాపు 5 గంటలపాటు రోగులు అవస్థలు పడ్డారు. ఎంజీఎం ఆస్పత్రికి కరెంటు సరఫరా పునరుద్ధరించే విషయంలో సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినపడుతున్నాయి.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైద్యంపై పట్టింపేది గుంపు మేస్త్రీ..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై ఘాటు ట్వీట్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు కల్పించే విషయం పక్కనపెడితే, కనీసం ఉన్న ఆస్పత్రుల్ని కూడా నిర్వహించలేకపోతోందని దుయ్యబట్టారు కేటీఆర్. కరెంటు కోతలు లేవని సీఎం, ఆయన మంత్రులు పదే పదే చెబుతున్నారని, మరి వరంగల్ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.