అన్నా.. జ‌ర ఈసారికి స‌ర్దుకోరాదే.. అస‌మ్మ‌తి నేత‌ల‌కు స‌ర్దిచెబుతున్న బీఆర్ఎస్

రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి కూడా గెలుస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లంతా గ‌ట్టి ధీమాతో ఉన్నారు. అందుకే ఈసారి టికెట్ల కోసం పోటీ జోరందుకుంది.

Advertisement
Update:2023-08-19 11:04 IST

తెలంగాణ‌లో అధికార బీఆర్ఎస్ అభ్య‌ర్థుల తొలి జాబితాను పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ రేపోమాపో విడుద‌ల చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. సోష‌ల్ మీడియాల్లో కొంత‌మంది రాజ‌కీయ విశ్లేష‌కులు, కొన్ని యూట్యూబ్ ఛాన‌ళ్ల‌యితే మ‌రో ముంద‌డుగు వేసి ఇదే జాబితా అంటూ అభ్యర్థుల లిస్ట్ అంటూ కూడా ప్ర‌క‌టిస్తున్నాయి. శ్రావ‌ణ‌మాసం కూడా వ‌చ్చినందున మంచిరోజు చూసుకుని లిస్ట్ విడుద‌ల చేస్తార‌ని మ‌రికొన్ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అధికార పార్టీలో అస‌మ్మ‌తి నేత‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిని బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు నిమ‌గ్న‌మ‌య్యారు.

ఆశావ‌హుల సంఖ్య పెరిగి బ‌య‌ట‌ప‌డుతున్న వ్య‌తిరేక‌త‌

రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి కూడా గెలుస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లంతా గ‌ట్టి ధీమాతో ఉన్నారు. అందుకే ఈసారి టికెట్ల కోసం పోటీ జోరందుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్య‌తిరేక‌త ఉన్న ఆశావ‌హులు పార్టీ నాయ‌కుల్ని కూడ‌గ‌ట్టుకొని చ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ అంటున్నారు. కీల‌క నేత‌లు కేటీఆర్‌, హ‌రీశ్‌ల దృష్టికి త‌మ అసంతృప్తిని తీసుకెళ్ల‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నారు.

అల‌క మానండ‌న్నా

ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా స‌భ‌లు, స‌మావేశాలు పెట్టుకునేవారు కొంద‌రైతే అనుకూల‌మైన శ్రేణుల్ని వెంటేసుకుని రాజ‌ధానికి వ‌చ్చి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న‌వారు కొంద‌రు. ఇలాంటి నేప‌థ్యంలో సిట్టింగ్‌ల‌ను మార్చాలంటే ర‌క‌ర‌కాల ఇబ్బందులుంటాయ‌ని గ్ర‌హించిన పార్టీ పెద్ద‌లు సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆ మాటే రాకుండా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒక అభ్య‌ర్థిని మార్చాలంటే సామాజిక‌వ‌ర్గం, డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌గ‌ల స్థోమ‌త‌, అన్ని వ‌ర్గాల‌కూ అనుకూల‌మైన‌వ్య‌క్తి, అన్నింటికీ మించి ప్ర‌త్యర్థిని దీటుగా ఎదుర్కోగ‌లిగే స‌త్తా ఉన్నవారిని చూడాలి. గ‌త ఎన్నిక‌ల్లోనే టికెట్ రాద‌నుకున్న తాటికొండ రాజ‌య్య లాంటి వారికి టికెట్ ద‌క్క‌డానికి కార‌ణం ఇవ‌న్నీ వెత‌క‌డం ఎందుక‌నే భావ‌నే. అందుకే ఈసారి జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్, మంథ‌ని, రామ‌గుండం, క‌ల్వ‌కుర్తి, కోదాడ ఇలా చోట్ల అభ్య‌ర్థిని మార్చాల‌ని ఒత్తిళ్లు వ‌స్తున్నా బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు అస‌మ్మ‌తి నేత‌ల‌కు స‌ర్దిచెప్ప‌డానికే ఎక్కువ‌గా మొగ్గుచూపుతున్నారు. జ‌న‌గామ‌, ఘ‌న్‌పూర్ త‌ప్ప మిగిలిన‌చోట్ల అల‌క మానాల‌ని నేత‌ల‌ను బుజ్జ‌గిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News