సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది
హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలతోనే నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ తమను విపరీతంగా టార్గెట్ చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క బలమైన నాయకులు కాబట్టే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారిని టార్గెట్ చేస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో అప్పటి అధికారపక్షాన్ని టార్గెట్ చేయలేదన్నారు. ఇప్పటికే కొంతమంది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని, వారంతా పార్టీపై ప్రేమతోనే వచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లోనూ చేరికలు ఉంటాయని తెలిపారు. ఎవరైనా పార్టీ నాయకులు బీసీల గురించి మాట్లాడితే అది పార్టీ లైన్ తప్పడం ఎంతమాత్రం కాదన్నారు. మూసీ ప్రక్షాళనకు అక్కడి నిర్వాసితుల్లో 50 శాతం మంది ఒప్పుకున్నారని, మిగతా వాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దసరా లోపే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని అనుకున్నా హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతోనే సాధ్యం కాలేదన్నారు.