రైల్వే మంత్రి రాజీనామా చేయాలి ...బీఆరెస్ డిమాండ్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని, రైల్వే ప్రమాద‌ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని భారత రాష్ట్ర సమితి (BRS) డిమాండ్ చేసింది.

Advertisement
Update:2023-06-04 08:05 IST

ఒడిశా లోని బాలాసోర్ లో జరిగిన‌ రైలు ప్రమాదానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని భారత రాష్ట్ర సమితి (BRS) అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

ఇది భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదంగా నిలిచిపోతుందన్నారాయన‌. మూడు రైళ్లు ఢీకొన్న బాలాసోర్ రైలు ప్రమాదం భారతీయ రైల్వేలో ప్రయాణీకుల భద్రత పట్ల పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని దాసోజు శ్రవణ్ అన్నారు.

''రైలు ఢీకొనకుండా నివారించే వ్యవస్థను భారతీయ రైల్వే 2011-12లో అభివృద్ధి చేసింది. కానీ దానిని అమలుపర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఒకవేళ యాంటీ-కాల్సిషన్ సిస్టమ్ అమలులో ఉంటే, ఈ పెను ప్రమాదం తప్పేది. ఈ ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలి.'' అని శ్రవణ్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇది కుట్రనా లేక మానవ తప్పిదమా అనేది తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఏపీ యూనిట్ కూడా డిమాండ్ చేసింది.

అలాగే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.25 లక్షలకు పెంచాలని, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని BRS కార్యకర్తలు సహాయ చర్యలలో పాల్గొనాలని, ఈ ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న వారికి అండగా ఉండాలని తోట చంద్రశేఖర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News