ప్రజలంటే మాకు ఓటు బ్యాంకు కాదు : మంత్రి కేటీఆర్

ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేసే బదులు ప్రతిపక్ష పార్టీలు ప్రజల మనసులను గెలుచుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.

Advertisement
Update:2023-03-07 09:47 IST

ప్రజలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు కాదని.. వారిని సాటి మనుషులుగానే చూస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ మత, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. కానీ కొన్ని పార్టీలు మాత్రం ప్రజలను కులం, మతం పేరిట విడదీసి నీచమైన రాజకీయాలు చేస్తోందని ఆయన చెప్పారు. సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేసే బదులు ప్రతిపక్ష పార్టీలు ప్రజల మనసులను గెలుచుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. ఇంత కాలం తాము ప్రజలకు ఏమి చేశామో ఆయా పార్టీలు చెబితే బాగుంటుందని.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చూపించి ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు అడగాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే చెప్పి ఓట్లు అడుగుతోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గతంలో తాము చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగగలవా అని ప్రశ్నించారు.

కులం, మతం, మతాచారాలను చూపించి సీఎం కేసీఆర్ ఏనాడూ వివక్ష చూపించలేదని.. అందరినీ సమాన దృష్టితోనే చూశారని అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలనేదే కేసీఆర్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ మాత్రమే పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం స్కాలర్ షిప్ ఇస్తున్న రాష్ట్రమని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే 7వేల మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్‌షిప్‌లను ఉపయోగించుకొని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు రూ.6వేల కోట్లను విద్యారంగం కోసం ఖర్చు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇక సిరిసిల్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News