ఖమ్మం సభతో బీజేపీ, కాంగ్రెస్ కి పిచ్చి లేచింది.. బీఆర్ఎస్ కౌంటర్

బీజేపీ నాయకులకు తెలంగాణ పథకాలు కనపడటం లేదని, వారు కళ్లు ఉండి కూడా అభివృద్ధిని కళ్లారా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటే.. అభివృద్ధి కళ్లకు కనపడుతుందని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-01-19 17:29 IST

ఖమ్మం సభతో బీజేపీ, కాంగ్రెస్ కి పిచ్చిలేచిందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. 5 లక్షల మంది జనాభా వస్తారని అనుకుంటే.. 6 లక్షలమంది వచ్చారని కనీ వినీ ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరిగిందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

కంటి వెలుగు ఉపయోగించుకోండి..

బీజేపీ నాయకులకు తెలంగాణ పథకాలు కనపడటం లేదని, వారు కళ్లు ఉండి కూడా అభివృద్ధిని కళ్లారా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటే.. అభివృద్ధి కళ్లకు కనపడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరుని సీఎం కేసీఆర్ పెట్టారని, పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలంటే బీజేపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు ఇంకా కొద్ది రోజులే ఉంటారని, తర్వాత తామే ఉంటామని చెప్పారు. దమ్ము, దైర్యం ఉంటే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రధాని మోదీతో ప్రకటింపచేయాలన్నారు.

రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి కౌంటర్లు..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కుమారస్వామి కర్నాటకలో పాదయాత్ర చేస్తున్నందుకే బీఆర్ఎస్ సభకు రాలేకపోయారని, దానిపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు ఎర్రబెల్లి. రాహుల్ గాంధీ పాదయాత్రకు ఏ ముఖ్యమంత్రి వచ్చారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బీజేపీ పరిపాలించే రాష్ర్టాలకు వెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని చెప్పారు. తెలంగాణ కంటే ఎక్కువ పథకాలు, ఎక్కువ పని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంటే తాము రాజీనామా చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని అభినందించి, అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభకు వచ్చిన ముఖ్యమంత్రులు తెలంగాణలోని పథకాలను పొగిడారని, మంచి పనుల్ని ఎవరైనా మంచి అనే అంటారని, దాన్ని అర్థం చేసుకోవడం బీజేపీకి చేతకాదన్నారు. బండి సంజయ్ కరీంనగర్ కి ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పనిచెయ్యరు, ఇతరులు చేస్తుంటే విమర్శిస్తుంటారని మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News