మాకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి.. బీజేపీ కాదు : మంత్రి కేటీఆర్

తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని ఆయన చెప్పారు.

Advertisement
Update:2023-04-27 06:43 IST

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిన వరుసగా మూడో సారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా ఆయన తప్పకుండా రికార్డు సృష్టిస్తారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లు తప్పకుండా గెలుచుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభను గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు.

తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలతో బీఆర్ఎస్‌కు పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యాయని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత అవినీతి, అసమర్థ, పనికిరాని ప్రధానిగా కేటీఆర్ అభివర్ణించారు.

బీజేపీ సమాజానికి చేసింది ఏమీ లేదని.. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎక్కువ డప్పు కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అత్యంత బలంగా ఉందనే విధంగా కల్పిత ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేసుకుంటూ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని.. ఈ సారి 100కు తగ్గకుండా డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేయాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్‌ను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌ ఎలా ఫెయిల్ అయ్యిందో ప్రజలకు చెప్పాలని భావిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఫెయిల్ అయిన గుజరాత్ మోడల్‌ను చూపెట్టి నరేంద్ర మోడీ 2014, 2019లో ప్రధాని మంత్రి అయినప్పుడు.. సక్సెస్ అయిన తెలంగాణ మోడల్‌ను ప్రజల ముందు ఉంచి కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని కేటీఆర్ ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10వేల రైతు బంధు, రూ.5 లక్షల ఉచిత రైతు బీమా, మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి మంచి నీటి నల్లాలు, ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులకు మద్దతు ధర చెల్లించి పంటను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు. ఇక ఓడీఎఫ్ + గ్రామాల లిస్టులో తెలంగాణ టాప్ అన్నారు. ఇలాంటివి చెప్పాలంటే లిస్టుకు అంతు ఉండదని చెప్పుకొచ్చారు. తెలంగాణ మోడల్ ద్వారా సాధించిన ఒక్క ఘనతను అయినా గుజరాత్ సాధించిందని చెప్పుకోగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని విజయవంతమైన దిశగా తీసుకెళ్లారని కేటీఆర్ ప్రశంసించారు. 9 ఏళ్లుగా రాష్ట్రానికి సమగ్రమైన, సంపూర్ణమైన, సుస్థిరమైన అభివృద్ధిని అందించిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం.. దేశానికే దిక్సూచిలా, ఆశాకిరణంలా మారిందని కేటీఆర్ అన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తాము.. మహారాష్ట్రను తొలి యుద్ద క్షేత్రంగా ఎంచుకున్నామని చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో మద్దతు లభిస్తోందని.. త్వరలోనే కర్ణాటక, ఏపీల్లో కూడా పార్టీని విస్తరిస్తామని చెప్పారు. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో 545 పార్లమెంటు సీట్లకు పోటీ చేయాలనే ఆత్రుతతో లేమని తెలిపారు. ఆ సమయంలో ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి తాము పోటీ చేసే స్థానాలు ఆధారపడి ఉంటాయన్నారు. బీజేపీ కూడా 2 సీట్ల నుంచి 300 సీట్లకు ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల మూడ్‌ను బట్టి తాము ముందుకు వెళ్తామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News