నగారా మోగేది కరీంనగర్ నుంచే..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్‌సింగ్ వంటి అతిరథ మహారథుల రానుండటంతో రాజకీయ వేడి ఇక్కడి నుంచే రగలబోతోంది.
రాజకీయ చైతన్యంలో తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. ఎంతోమంది అగ్రనేతలను అందించి, మరెంతో మందిని చట్టసభలకు పంపిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ ఎన్నికల్లోనూ ప్రచార నగారాకు శ్రీకారం చుట్టే వేదిక కాబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్‌సింగ్ వంటి అతిరథ మహారథుల రానుండటంతో రాజకీయ వేడి ఇక్కడి నుంచే రగలబోతోంది.
హుస్నాబాద్ నుంచి కేసీఆర్ శంఖారావం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ (ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలోకి వచ్చింది)లో బహిరంగ సభతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 15న ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. తర్వాత 17న జమ్మికుంట, నవంబరు మొదటివారంలో ధర్మపరి, కోరుట్ల, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొండగట్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఇక బీజేపీలో కీలక నేత ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి పార్టీ ప్రచారానికి తెరతీయనున్నారు. దీనికి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లాంటి కీలక నేతలతోపాటు పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రానుండటంతో కమలదళం కూడా హుషారు చూపిస్తోంది. మొత్తంగా మూడు పార్టీల ప్రచార నగారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మోగబోతోంది.