R.S.ప్రవీణ్‌కు పార్టీలో కీలక పదవి.. కేసీఆర్ హామీ.!

పార్టీ ఒకసారి ఓడితే నష్టమేం లేదన్నారు కేసీఆర్. గాడిద వెంట వెళ్తేనే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ హామీలను ప్రజలు నమ్మారని.. త్వరలోనే రియలైజ్ అవుతారని చెప్పారు.

Advertisement
Update:2024-03-18 21:59 IST

బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన R.S.ప్రవీణ్‌కుమార్‌కు కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఆ పార్టీ చీఫ్‌ కేసీఆర్. త్వరలోనే ఆయనను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో ప్రవీణ్‌ కుమార్ మంచి స్థానంలో ఉంటారని చెప్పారు. R.S.ప్రవీణ్ చేరిక సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఆఫ్‌ కెమెరాలో పలు అంశాలపై ప్రస్తావించారు. త్వరలోనే పార్టీ పునర్‌నిర్మాణం చేపట్టి.. కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.

పార్టీ ఒకసారి ఓడితే నష్టమేం లేదన్నారు కేసీఆర్. గాడిద వెంట వెళ్తేనే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ హామీలను ప్రజలు నమ్మారని.. త్వరలోనే రియలైజ్ అవుతారని చెప్పారు. కష్టపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం 100 శాతం ఖాయమన్నారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏం లేదన్నారు. ప్రవీణ్‌ అంకితాభావం ఉన్న వ్యక్తి అని.. రెసిడెన్షియల్ స్కూల్స్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.

మూడు నెలల కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు కేసీఆర్. దళితబంధు పథకాన్ని నిలిపివేయడం సరికాదన్నారు. దళితబంధు పొందిన కుటుంబాలు మెరుగైన స్థితిలో ఉన్నాయన్నారు. దళిత సమాజం ఈ పథకాన్ని ఎందుకు సానుకూలంగా తీసుకోలేకపోయిందో మేధావులు విశ్లేషించుకోవాలన్నారు. గెలిచినా, ఓడినా సంయమనంతో ఉండాలన్నారు. 1969 నుంచే తెలంగాణ అంశం తన మదిలో ఉందని చెప్పారు. ఉమ్మడి పాలకులతో తెలంగాణకు విద్యుత్ అంశంలో జరిగిన నష్టంపై పోరాడానని గుర్తుచేశారు కేసీఆర్. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో ఉండి తాను పరిష్కరించిన అంశాలను వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్న ఆ టైమ్‌లో ఆయ‌న‌కు ప్రపంచ బ్యాంకు పిచ్చి పట్టిందని.. తాగునీరు, విద్యుత్ లాంటి ప్రజల కనీస అవసరాలను ఆయన పట్టించుకోలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News