ఆ పదాలు మింగేశారు, తప్పు మాపై నెట్టారు

ఒప్పందంలో 'రైతులు మినహా' అని ఉంటే.. రేవంత్ రెడ్డి మాత్రం 'రైతులు కూడా' అనే అర్థం వచ్చేట్టు పైకి చదివి వినిపించారు.

Advertisement
Update:2024-07-28 19:00 IST

తెలంగాణలో రైతులు వాడే విద్యుత్ మోటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంతో ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకోసం ఒప్పందాలు జరిగాయని ఆయన అన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఆయన అసెంబ్లీలో చదివి వినిపించారు. అయితే ఇక్కడే ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 'రైతులు మినహా' అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆయన చదవలేదని అన్నారు.


భూకబ్జాలతో భూములను మింగినట్టు.. అసెంబ్లీలో పదాల్ని మింగేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగానే ఆయన కొన్ని పదాలను చదవలేదని చెప్పారు. తెలంగాణలో నెలకు 500 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించిన వారందరికీ స్మార్ట్ మీటర్లు పెడతామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. కానీ వాస్తవంగా ఆ ఒప్పందంలో ఉన్న పదాలు వేరు. 'అదర్ దేన్ అగ్రికల్చరల్ కన్జూమర్స్' అనే పదాన్ని ఆయన పలకలేదు. ఒప్పందంలో 'రైతులు మినహా' అని ఉంటే.. రేవంత్ రెడ్డి మాత్రం 'రైతులు కూడా' అనే అర్థం వచ్చేట్టు పైకి చదివి వినిపించారు. అక్కడితో ఆగకుండా తన అనూకూల మీడియాతో తప్పు గత ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం కూడా చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.

వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారం చాన్నాళ్లుగా నలుగుతూనే ఉంది. స్మార్ట్ మీటర్లు పెడితే రైతులకు మరణ శాసనం రాసినట్టేనని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము అధికారంలో ఉండగా ఆ పని చేయబోమన్నారు, కేంద్రం నిధులు ఎగ్గొట్టినా పర్వాలేదని రైతుల పక్షాన నిలిచామని చెప్పేవారు బీఆర్ఎస్ నేతలు. కానీ గతంలో బీఆర్ఎస్ స్మార్ట్ మీటర్లకోసం ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News