తెలంగాణలో బ్రహ్మ గర్జన

బ్రాహ్మణులను కించపరిచేలా తీసిన సినిమాలకు వ్యతిరేకంగా జాగృతి పోరాడిన ఉదాహరణలను కవిత గుర్తు చేశారు. విప్రహిత భవనాలకోసం ఇతర రాష్ట్రాల్లో కూడా డిమాండ్లు వినపడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.

Advertisement
Update:2023-07-10 06:56 IST

తెలంగాణ ఉద్యమంలో బడిబందు అన్నప్పుడు గుడిబందు అంటూ బ్రాహ్మణులు కూడా ముందుకు నడిచారని, స్వరాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. అలాంటి వారిని ప్రభుత్వం మరచిపోలేదని, కడుపులో పెట్టుకుని చూసుకుంటోందని చెప్పారు. తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. 75 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, కేసీఆర్ హయాంలోనే అన్ని వసతులు సమకూరుతున్నాయని చెప్పారు. బ్రహ్మ గర్జన సభలో ఆమె పాల్గొన్నారు.

ధూపదీప నైవేద్యం కింద గతంలో ఆలయాలకు రూ.2,500 ఇచ్చేవారని, దాన్ని రూ.10 వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు కవిత. గతంలో 6 వేల గుడులకు మాత్రమే ఈ సాయం అందేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8వేల గుడులకు పెంచామని చెప్పారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ.2,242 కోట్ల నిధులు కేటాయించామన్నారు. యాదగిరిగుట్ట క్షేత్ర పునర్నిర్మాణానికి రూ.1200 కోట్లు, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు అనేక ఇతర గుడులను అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. బోనాల సందర్భంగా హైదరాబాద్‌ లోని 1600 ఆలయాలకు రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు కేటాయించామని వివరించారు కవిత.


విద్య, సంక్షేమం..

బ్రాహ్మణ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్‌ లో చదువుకునే అవకాశం కల్పించింది తమ ప్రభుత్వమే అని చెప్పారు కవిత. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తోందని అన్నారు. 780 మంది బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్య సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ద్వారా వేలాదిమందికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. బ్రాహ్మణులను కించపరిచేలా తీసిన సినిమాలకు వ్యతిరేకంగా జాగృతి పోరాడిన ఉదాహరణలను ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన విప్రహిత భవనాలకోసం ఇతర రాష్ట్రాల్లో కూడా డిమాండ్లు వినపడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. బ్రహ్మగర్జనలో చేసిన తీర్మానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కవిత. 

Tags:    
Advertisement

Similar News