ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంపూర్ణ అమలు బాధ్యత నాదే
ఆదివాసీ, గిరిజన ప్రజాప్రతినిధులు శిక్షణ శిబిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నాగార్జున సాగర్ లో ఆదివాసీ, గిరిజన ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. సబ్ ప్లాన్ అమలులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఎస్సీ, ఎస్టీల సంపూర్ణ అభివృద్ధికి సబ్ ప్లాన్ చట్టం సర్వరోగ నివారిణి అన్నారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధుల కేటాయింపు, ఖర్చుల వివరాలు ఇవ్వాలని అన్నిశాఖల సెక్రటరీలను ఆదేశించానన్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు ఇప్పటికే నివేదిక ఇచ్చాయని.. మిగతా శాఖల నుంచి వీలైనంత త్వరగా నివేదికలు తెప్పిస్తానని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఐటీడీఏలకు పునరుజ్జీవం తీసుకువస్తామని.. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశ సంపద, వనరులు దామాషా ప్రకారం ఇక్కడి ప్రజలకే చెందాలి తప్ప కార్పొరేట్ శక్తులకు కాదన్నారు. రాజ్యాంగాన్ని బలహీన పరిచేందుకు అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. అందుకే రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ నడుం బిగించారని తెలిపారు. రాష్ట్రంలో పీసా, అటవీ హక్కుల చట్టాన్ని వందశాతం అమలు చేస్తామన్నారు.
ఇల్లు లేని పేదలకు ఈ ఏడాది రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇంకో రూ.లక్ష సాయం అందజేస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. సాగుయోగ్యమైన భూములకు రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున ఇస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వబోతున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించబోయే ఈ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలను తీసుకువచ్చాయన్నారు. పీసా, అటవీ హక్కు చట్ట, గ్రామీణ ఉపాధి హామీ, ఆర్‌వోఆర్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాలు ప్రజల కోసం తెచ్చినవేనని చెప్పారు. గిరిజన రైతులకు హక్కులు కల్పించిన భూములకు సోలార్ పవర్ సదుపాయం కల్పిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.