ఈ వానాకాలం సీజన్ నుంచే సన్నవడ్లకు బోనస్
ధాన్యం కొనేందుకు 7,139 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సన్నవడ్లకు ఈ సీజన్ నుంచే క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో 2024 -25 వానాకాలం పంట కొనుగోలుపై జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ మేనేజర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వానాకాలం సీజన్ లో రైతులు 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని తెలిపారు. ఇందులో 36.80 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేశారని, 88.09 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. సన్నవడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇప్పటి నుంచే అందజేస్తామని తెలిపారు. మొత్తంగా వానాకాలంలో 1.46 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని, అందులో 91.28 లక్షల టన్నుల ధాన్యం 7,139 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసేలా గోదాములు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కస్టమ్ మిల్లింగ్ డిఫాల్ట్ అయిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ తెచ్చి ధాన్యం అమ్మకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రైతులు సున్నిత మనస్కులని, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. రైతుల నుంచి సేకరించే వడ్లను మిల్లింగ్ చేయించి జనవరి నుంచి రేషన్ కార్డులపై పంపిణీ చేస్తామన్నారు. మొత్తం 3 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం ఇస్తామన్నారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో పీఏసీఎస్ ల ద్వారా 4,496, ఐకేపీ ఆధ్వర్యంలో 2,102, ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకు ఆయా జిల్లాల్లో వరికోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ ప్రియాంక అలా, అధికారులు లక్ష్మీ, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.