దొడ్డు వడ్లకూ క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌ ఇవ్వాలి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-10-04 16:48 IST

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా దొడ్డు వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌ కు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన రివ్యూలో సీఎం రేవంత్‌ రెడ్డి సన్నవడ్లకే బోనస్‌ ఇస్తామని చెప్పడం అంటే రైతులను మోసం చేయడమేనని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు సన్నవడ్లకే బోనస్‌ ఇస్తామని చెప్పలేదని, వడ్లకు బోనస్‌ ఇస్తామన్నారు కాబట్టి రైతులందరికీ బోనస్‌ ఇచ్చి తీరాలన్నారు. ముఖ్యమంత్రికి అనుమానం ఉంటే కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఒకసారి చదువుకోవాలన్నారు. గత యాసంగి సీజన్‌ లో వడ్లు పండించిన రైతులకు కూడా బోనస్‌ చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు దొడ్డు వడ్లే సాగు చేస్తారని, రైతులందరికీ బోనస్‌ ఇస్తామని చెప్తేనే కాంగ్రెస్‌ పార్టీని వాళ్లు నమ్మి ఓటేశారని గుర్తు చేశారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత సన్నవడ్లకే బోనస్‌ అని సన్నాయి నొక్కులు నొక్కడం అంటే వారిని నిలువునా మోసం చేయడమేనన్నారు. రైతులందరికీ బోనస్‌ చెల్లించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వారి తరపున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

వానాకాలం పంట సీజన్‌ పూర్తయ్యిందని, కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ఎకరానికి ఒక సీజన్‌ కు రూ.7,500 చొప్పున రూ.15 వేల బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. యాసంగి సీజన్‌ లో అప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమకూర్చిన పైసలు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసి రేవంత్‌ రెడ్డి చేతులు దులుపుకున్నారని అన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు పంటలు సాగు చేసే సమయానికి రైతుబంధు సాయం వారి ఖాతాల్లో జమ చేసే వారని, రేవంత్‌ రెడ్డి ఒక సీజన్‌ పూర్తయ్యాక కూడా రైతు భరోసా వేయలేదన్నారు. మూసీ ప్రక్షాళన కు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తహతహలాడుతున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతుభరోసా ఇవ్వమంటే పైసలు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏటా రైతులకు ఇచ్చే రూ.10 వేల సాయం ముష్టి అని.. తాను రూ.15 వేలు ఇస్తానని ప్రగ్భాలాలు పలికి ఇప్పుడు ఎందుకు సాయం చేయడం లేదో చెప్పాలన్నారు. రెండు సీజన్‌లకు సంబంధించిన రైతుభరోసా సొమ్ము రైతుల ఖతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ఏకకాలంలోనే రూ.2 లక్షల రుణమాఫీ డిసెంబర్‌ 9న చేస్తామని హామీ ఇచ్చి పది నెలలైనా దానిని నిలబెట్టుకోలేదన్నారు. ఇంకా 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. అధికారిక లెక్కలే ఇలా ఉంటే.. అనధికారిక లెక్కల ప్రకారం రుణమాఫీ చేయాల్సిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్నారు. రేవంత్‌ చేతకానితనం రైతులకు కోలుకోలేని శాపంగా మారిందన్నారు. వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News