65 మందితో నేడు బీజేపీ తొలి జాబితా ప్రకటన!

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో గురువారం కోర్ కమిటీ సభ్యలు పలు దఫాలుగా సమావేశమై చర్చలు నిర్వహించారు.

Advertisement
Update:2023-10-20 07:33 IST

65 మందితో నేడు బీజేపీ తొలి జాబితా ప్రకటన!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి జాబితా శుక్రవారం విడుదల కానున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై చాలా రోజులు కావొస్తున్నా బీజేపీ మాత్రం ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించ లేదు. సరైన అభ్యర్థులు లేకపోవడం, ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయనే కారణంతో ఇన్నాళ్లూ జాబితాను విడుదల చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో గురువారం కోర్ కమిటీ సభ్యలు పలు దఫాలుగా సమావేశమై చర్చలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కే.లక్ష్మణ్, జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇప్పటికే పలు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తామంటూ పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కొంత మంది టికెట్ ఆశించి పార్టీలో చేరారు. అంతే కాకుండా ముఖ్య నేతలు పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువ పోటీ ఉన్నదో పరిశీలించారు. అక్కడ సరైన అభ్యర్థి కోసం, సామాజిక వర్గాల పరంగా సీట్ల కేటాయింపుపై చర్చ జరిగింది. తుది జాబితాపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చర్చించినట్లు తెలుస్తున్నది.

జాబితాపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన అనంతరం గురువారం రాత్రి అమిత్ షాతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఇక ఇవ్వాళ ఉదయం కూడా మరోసారి జేపీ నడ్డాతో సభ్యులు భేటీ కానున్నారు. తుది జాబితాను అప్పుడే సిద్ధం చేసి.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు సంబంధించిన పెండింగ్ లిస్టుపై చర్చ జరుగనున్నది.

బీజేపీ రాష్ట్ర అభ్యర్థులకు సంబంధించి తొలి లిస్టులో 65 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం రాత్రిలోగా ఈ లిస్టు విడుదల అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే రెండో లిస్టుపై కూడా సభ్యులు చర్చ జరపనున్నారు. తొలి లిస్టులోనే బలమైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా.. అసెంబ్లీ ఎన్నికల్లో తామూ రేసులో ఉన్నామనే సంకేతాలను పంపాలని బీజేపీ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News