మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ వెనకడుగు.. ఇప్పుడే వద్దంటున్న సీనియర్లు?

ఫిబ్రవరి 8 లోపు మునుగోడుకు ఉపఎన్నిక నిర్వహించే వెసులుబాటు ఈసీఐకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా మునుగోడు ఉపఎన్నిక నవంబర్‌లో వస్తుందని అంచనా వేస్తున్నాయి

Advertisement
Update:2022-09-05 07:17 IST

మునుగోడు ఉపఎన్నిక విషయంలో బీజేపీ వెనకడుగు వేస్తోందా? ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే మూడో స్థానానికే పరిమితం అవుతుందని భావిస్తోందా? రాజగోపాల్ రెడ్డి సొంత బలంతో గెలవలేమనే అంచనాకు వచ్చిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు ఉపఎన్నిక విషయంలో ఓ కీలకనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ విషయాన్ని అధిష్టానానికి చేరవేశారని.. ఉపఎన్నికను కాస్త ఆలస్యంగా నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్‌ను ఒప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. కనీసం రెండు నెలల పాటు వాయిదా వేస్తే.. పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి సమయం ఉంటుందని అధిష్టానాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెల 8న పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ లెజిస్లేటీవ్ అసెంబ్లీ సెక్రటేరియట్ వెంటనే నోటిఫై కూడా చేసి.. ఆ సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు ఉపఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 8 లోపు మునుగోడుకు ఉపఎన్నిక నిర్వహించే వెసులుబాటు ఈసీఐకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా మునుగోడు ఉపఎన్నిక నవంబర్‌లో వస్తుందని అంచనా వేస్తున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉపఎన్నిక నిర్వహిస్తారని రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరిగింది.

కాగా, బీజేపీ మాత్రం ఉపఎన్నికను రెండు నెలల పాటు వాయిదా వేయాలని, నవంబర్‌లో కాకుండా జనవరి రెండో వారంలో నిర్వహించాలని ఈసీఐని కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మునుగోడు ఉపఎన్నిక విషయంలో రాష్ట్ర బీజేపీ పూర్తి స్థాయిలో సిద్ధంగా లేదని.. అందుకే వాయిదా వేయాలని కోరుతున్నట్లు సమాచారం. బీజేపీకి మునుగోడులోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బలమైన క్యాడరే లేదు. అక్కడ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు మొదటి నుంచి పట్టు ఉన్నది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగింది. మునుగోడులో నిర్వహించిన సర్వేలో బీజేపీకి ఇప్పుడు ఉన్న క్యాడర్‌తో ఉపఎన్నికకు వెళ్తే.. తప్పకుండా ఓటమి ఎదురవుతుందని తెలిసిందని ఓ బీజేపీ నాయకుడు అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కానీ ఆయనతో కనీసం 20 శాతం మంది కాంగ్రెస్ క్యాడర్ కూడా బీజేపీలోకి రాలేదు. మరోవైపు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి అసలు టచ్‌లోనే ఉండటం లేదు. గత 20 రోజుల్లో ఆయన ఒక్కసారి కూడా స్థానిక బీజేపీ క్యాడర్‌తో మాట్లాడలేదని.. దీంతో బీజేపీ స్థానిక లీడర్లు కూడా ఆయనతో పని చేయడానికి పూర్తి స్థాయిలో సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నదని, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్‌కు ఓటు బ్యాంకు పెరిగిందని ఓ సర్వేలో తేలింది. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత చరిష్మాతో ఉపఎన్నిక బరిలోకి దిగి గెలవడం అసాధ్యమని బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తున్నది.

ఉపఎన్నికలను నవంబర్‌లో కాకుండా జనవరిలో నిర్వహిస్తే స్థానిక నాయకత్వానికి కొంచెం సమయం వస్తుంది. పార్టీ జాతీయ నాయకులు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉండటంతో వాళ్లు కూడా మునుగోడుపై పూర్తిగా దృష్టిపెట్టడం లేదు. అదే జనవరి అయితే బీజేపీ అధినాయకత్వం కూడా తమ వ్యూహాలతో మునుగోడు గెలుపుపై పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఉపఎన్నిక ఆలస్యం అయితే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను కూడా బీజేపీలో చేర్పించడానికి సమయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మొదట్లో ఉపఎన్నికమై అమితమైన ఆసక్తి ప్రదర్శించిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల తన స్వరం మార్చారు. కేసీఆర్‌కు మునుగోడు ఉపఎన్నికకు వెళ్లే ఉద్దేశం లేదని, ఏకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌లో కేసీఆర్ అసలు ముందస్తు ఊసే ఎత్తలేదు. ఇదంతా బీజేపీ ఉపఎన్నికను ఎదుర్కోలేక చేస్తోన్న ప్రచారమేనని.. ఆ పార్టీకి ఉపఎన్నికలో మూడో స్థానం గ్యారెంటీ అని మంత్రి జగదీశ్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు.మొత్తానికి మునుగోడు ఉపఎన్నికను కాస్త ఆలస్యంగా జరపడానికి బీజేపీ ఢిల్లీ లెవల్లో అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News