బీజేపీలో మెరవని తారలు.. ఒక్కరికీ దక్కని టికెట్
ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత పలు రాజకీయ పార్టీల్లో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరి చాలాకాలమైంది. కానీ, ఇప్పటి వరకు ఆమెకు సరైన ప్రాధాన్యమే లేదు.
ఇంకేముంది తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే అన్నట్లుగా ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారానికి పొలోమని కమలదళంలో చేరిపోయిన మహిళా నేతలు, సినీతారలు ఇప్పుడు టికెట్ రాక లబోదిబోమంటున్నారు. తెరపై వెలిగినట్లే రాజకీయాల్లోనూ మెరవాలని ఆశించిన సీనియర్ హీరోయిన్ల పరిస్థితి చివరి నిమిషంలో రోల్ చేజారినట్లయింది. సీనియర్ నటులు విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారంతా ఈ జాబితాలో ఉన్నారు.
టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు
ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత పలు రాజకీయ పార్టీల్లో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరి చాలాకాలమైంది. కానీ, ఇప్పటి వరకు ఆమెకు సరైన ప్రాధాన్యమే లేదు. ఆమెతో రాష్ట్ర నాయకులు అంటిముట్టనట్లే ఉంటున్నారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పడిపోవడంతో పోటీ చేసినా ప్రయోజనం ఉండదని విజయశాంతి భావించారని, అందుకే ఆమె టికెట్‌కోసం పెద్దగా ఒత్తిడి చేయలేదని సమాచారం. సికింద్రాబాద్ సీటు వస్తుందని సీనియర్ నటి జయసుధ ఆశలు పెట్టుకున్నారు. ఆమెకూ హ్యాండిచ్చారు. జూబ్లీహిల్స్ సీటు కోసం మరో నటి జీవితారాజశేఖర్ పోటీ పడినా ఆమెను కాదని దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.
ఇస్తే కనీసం ప్రచారమన్నా జరిగేదిగా!
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి రాష్ట్రంలో అధికారంపై ఆశలేమీ లేవు. పట్టుమని పది స్థానాలు గెలుస్తారా అంటే ఆ పార్టీ నేతల దగ్గరే సమాధానం లేదు. అలాంటప్పుడు జనాల్లో బాగా తెలిసిన సినీ తారలకన్నా టికెట్లిచ్చి, అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకుంటే కాస్త సందడి అయినా ఉండేదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఎంత పాతవారయినా వారు ఒకప్పుడు వెండితెరపై మెరిసిన తారలే కదా అని గుర్తు చేస్తున్నాయి.