పొత్తు పెట్టుకున్న పవన్‌కు చుక్కలు చూపిస్తున్న బీజేపీ
బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా పవన్ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మూడో జాబితా విడులైనా ఇంకా జనసేనకు ఇవ్వబోయే సీట్లను బీజేపీ ఫైనల్ చేయకపోవటం ఆశ్చర్యంగానే ఉంది.
ఏ ముహూర్తంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కానీ అప్పటినుంచి అంతా టెన్షనే. నిజానికి రెండు పార్టీలు దేనికదే పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. అందుకనే జనసేన తాను పోటీ చేయబోయే 32 నియోజకవర్గాల లిస్టును కూడా ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఏమైందో ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. జరుగుతున్నది చూస్తుంటే తమతో పొత్తు పెట్టుకునేట్లుగా బీజేపీయే పవన్‌ను కార్నర్ చేసినట్లుంది. అందుకనే వేరేదారిలేక పవన్ పొత్తు పెట్టుకున్నారు.
పొత్తు పెట్టుకున్నదగ్గర నుండి పవన్‌కు బీజేపీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు ఇదంతా దేనికంటే జనసేనను సొంతంగా పోటీచేయనివ్వదు, అలాగని పొత్తులో సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను తేల్చదు. తాజాగా 35 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అంటే మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. ఇంకా 31 మంది అభ్యర్థులను ప్రకటించాలి. మిగిలిన 31 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని కేటాయిస్తుందో తెలీదు. ఏ నియోజకవర్గాలను కేటాయిస్తుందో కూడా చెప్పలేదు. 3వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను తేల్చలేదు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా పవన్ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. రోజురోజుకు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలు జనసేనకు కేటాయించద్దని బీజేపీలో గోల పెరిగిపోతోంది. తాజాగా నాగర్ కర్నూలు సీటును ఇచ్చేందుకు లేదని గోల మొదలైంది. అంటే మెల్లిమెల్లిగా జనసేనను బీజేపీ ఒత్తిడిలోకి నెట్టేస్తోందని అర్థమవుతోంది. మూడో జాబితా విడులైనా ఇంకా జనసేనకు ఇవ్వబోయే సీట్లను బీజేపీ ఫైనల్ చేయకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. కానీ పవన్ చేయగలిగేది కూడా ఏమీలేదు.
అసలు అభ్యర్థులను ఫైనల్ చేయటానికి బీజేపీ ఇన్ని రోజులు సమయం తీసుకోవటమే విచిత్రంగా ఉంది. పార్టీవర్గాల ప్రకారమే 40 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులుంటే చాలా ఎక్కువ. మిగిలిన నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేకనే ఇతర పార్టీల్లో నుండి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించటంలో ఇంత జాప్యం చేస్తోంది. పోనీ జనసేన విషయాన్ని ఫైనల్ చేస్తుందా అంటే అదీ చేయటంలేదు. మొత్తానికి పవన్‌కు బీజేపీ కారణంగా చుక్కలు కనబడుతున్నాయనటంలో సందేహంలేదు.